టెండర్ లేకుండానే ఖని సిమ్స్ క్యాంటీన్ నిర్వహణ..?
By
Rathnakar Darshanala
టెండర్ లేకుండానే ఖని సిమ్స్ క్యాంటీన్ నిర్వహణ..?
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌కు అప్పగించారంటూ ఆరోపణలు
నేటి వార్త సెప్టెంబర్ 02 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ
గోదావరిఖని: సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఖని సిమ్స్) మెడికల్ కళాశాలలో క్యాంటీన్ నిర్వహణను ఎలాంటి బహిరంగ టెండర్ ప్రక్రియ లేకుండానే ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ తెలిపారు.
కళాశాల ప్రారంభమై సుమారు నాలుగు సంవత్సరాలు గడిచినా క్యాంటీన్ నిర్వహణ ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు.
తాజాగా సుమారు పది రోజుల క్రితం కళాశాల నిర్మాణ పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్‌కు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపించారు.
క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి గతంలో ఎలాంటి బహిరంగ టెండర్లు పిలిచారా? స్థానిక నిరుద్యోగులకు ఎందుకు అవకాశం కల్పించలేదనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.
ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే క్యాంటీన్ ప్రారంభించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
క్యాంటీన్ కేటాయింపులో రూ.10 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోందని, అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత అనేది ప్రభుత్వం సమగ్ర విచారణ ద్వారా తేల్చాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం క్యాంటీన్‌లో విద్యార్థులకు టీ, కాఫీ, స్నాక్స్ తదితర వస్తువులను విక్రయిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కళాశాలలో క్యాంటీన్ నిర్వహణకు సంబంధించిన టెండర్ వివరాలు, నిబంధనలు, ఒప్పందం, నిర్వహణ కాలపరిమితి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తదితర వివరాలను బహిరంగపరచాలని కోరారు.
ఐదు సంవత్సరాల నిర్వహణకు ఒప్పందం కుదిరిందా? కుదిరితే ఏ నిబంధనల ప్రకారం కుదిరింది?
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? టెండర్ లేకుండా క్యాంటీన్ నిర్వహణ అప్పగించడానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.
స్థానిక నిరుద్యోగ యువత క్యాంటీన్ నిర్వహణ కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవకాశం కల్పించకుండా ఇతర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం అన్యాయమని ఆయన అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే ప్రస్తుత కేటాయింపును నిలిపివేసి, పారదర్శకమైన టెండర్ ప్రక్రియ నిర్వహించి స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరారు.
అదేవిధంగా క్యాంటీన్ కేటాయింపుపై వచ్చిన రూ.10 లక్షల ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించాలని, వైద్య విద్యాశాఖ మంత్రి, డీఎంఈ అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రతి వ్యవహారం నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరగాలని, అధికారులు తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.
ఈ విషయంపై డీఎంఈతో పాటు వైద్యశాఖ మంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్లు మద్దెల దినేష్ తెలిపారు.
Comments