మార్పు రావాలి.. రైతు రాజ్యం రావాలి.
By
Rathnakar Darshanala
మార్పు రావాలి.. రైతు రాజ్యం రావాలి.
-కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తేవాలి.. బీఆర్‌ఎస్ నేతల పిలుపు
-రైతు సమస్యలపై రాయికల్‌లో భారీ ర్యాలీ, రైతు సదస్సు
నేటివార్త రాయికల్, సెప్టెంబరు 3: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో గురువారం రైతు ర్యాలీ, రైతు సదస్సు నిర్వహించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గాంధీ విగ్రహం నుంచి మార్కెట్ వరకు పార్టీ జెండాలు, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సదస్సుకు బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
*24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి*
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను సాధించిన కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అరకొర విద్యుత్ సరఫరాతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ ద్వారా సాగునీటి విషయంలో గత ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు జరిగిందన్నారు.
కన్నెపల్లి పంప్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతుల నుంచి కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.
ట్రక్ షీట్, ధర్మకాంటా తూకాల మధ్య వ్యత్యాసాలను పరిశీలించి, రైతులకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.
*‘కొబ్బరికాయలు కొట్టడం తప్ప అభివృద్ధి ఏదీ లేదు’*
జగిత్యాల ఎమ్మెల్యేపై జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టడం తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులే కొనసాగుతున్నాయని ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోవడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు.
బీడీ కార్మికులు, వృద్ధులు తదితరులకు పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
రైతు రాజ్యం రావాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కులమతాలకు అతీతంగా ఏకమై కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
*మల్లాపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి*
మల్లాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
*వెయ్యి రోజులైనా హామీలు అమలు కాలేదు*
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసి అండగా నిలిచామని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల పంపిణీలో ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని విమర్శించారు.
*రైతుబీమాను కొనసాగించాలి*
దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబీమా, రైతుబంధు ద్వారా రైతు కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా, రైతుబంధు విషయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మరింత బలంగా పోరాటం చేస్తామని తెలిపారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి.. ట్రక్ షీట్, ధర్మకాంటా తూకాల వ్యత్యాసాలను సరిచేసి రైతులకు న్యాయం చేయాలి..
మల్లాపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి.. రైతు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, శ్రీధర్ రెడ్డి, సౌజన్య, పట్టణ ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments