రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.
By
Rathnakar Darshanala
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.
ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన.
నేటివార్త రాయికల్ మే 6:
రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో బుధవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల పొలాస, జగిత్యాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హెడ్ డా. పి. సుజాత మాట్లాడుతూ తెలంగాణలో పంట మార్పిడి అవసరం, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు, సమగ్ర వ్యవసాయ విధానాలు, ఎరువుల సమతుల వినియోగం వంటి అంశాలను వివరించారు.
పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతుల ఆదాయం పెంపు సాధ్యమని తెలిపారు. వాతావరణ మార్పులు, భూసార క్షీణత, పెరుగుతున్న సాగు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వరి పంటతో పాటు పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని సూచించారు.
అలాగే నాణ్యమైన విత్తనాల వినియోగం, సమయానికి విత్తడం, సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులు పాటించడం, చీడపీడల సమగ్ర నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని చెప్పారు.
వరి గడ్డిని కాల్చకూడదని రైతులతో ప్రతిజ్ఞ చేయించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో రైతులు తమ సమస్యలు, విత్తనాల లభ్యత, ఎరువుల వినియోగం, మార్కెట్ ధరలు, పంటల ఎంపికపై పలు సందేహాలను అడిగి నివృత్తి పొందారు.
శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు అందించిన సూచనలను రైతులు ఆసక్తిగా విన్నారు.ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఆధునిక సాంకేతికతలను చేరువ చేసి, వారి ఆదాయం పెంపుకు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.
గ్రామస్థులు కూడా వ్యవసాయ శాఖ, వ్యవసాయ కళాశాలల సమిష్టి సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో డా. పి. సుజాత (ప్రొఫెసర్ హెడ్), కె. యోగిత (వ్యవసాయ అధికారి), ఉద్యానవన శాఖ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రగతిశీల రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎ. గణేష్ రెడ్డి, ఎ. రాము తదితరులు పాల్గొన్నారు.
Comments