వంతెన పూర్తై రెండేళ్లు…రోడ్లు మాత్రం రాళ్లమయం.:రాయికల్–మైతాపూర్,

Rathnakar Darshanala
వంతెన పూర్తై రెండేళ్లు…రోడ్లు మాత్రం రాళ్లమయం!*
:రాయికల్–మైతాపూర్,
 రాయికల్ -రామాజీపేట్ మార్గాల్లో ప్రజలకు నిత్య నరకం.

నేటివార్త రాయికల్, ఏప్రిల్ 27: రాయికల్–మైతాపూర్, రాయికల్–రామాజీపేట్ గ్రామాల మధ్య నిర్మించిన కొత్త వంతెనకు రెండేళ్లు పూర్తయినా, వంతెనకు ఇరువైపులా ఉన్న రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రజలకు నిత్య నరకంగా మారాయి. 

రహదారులపై పెద్ద పెద్ద రాళ్లు, గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతిరోజూ ఈ మార్గాన్ని ఉపయోగించే గ్రామ ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. 
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనుల కోసం రాకపోకలు సాగించే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త వంతెన నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సులభమవుతుందని ప్రజలు ఆశించినా, అనుసంధాన రహదారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. 

రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇప్పటికే రహదారి రాళ్లతో నిండిపోవడంతో అంబులెన్స్‌లు, అత్యవసర సేవలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. 
వర్షాలు ప్రారంభమైతే మట్టి, నీరు చేరి రాకపోకలు పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యపై సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎమ్మెల్యే, ఎంపీ, ఇరు గ్రామాల సర్పంచ్‌లు వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తి చేయాలని గ్రామ ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రజల సౌకర్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

.“వంతెన నిర్మాణం జరిగినా రోడ్లు సరిగ్గా లేక ప్రతిరోజూ ప్రాణాలు చేతబట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. వర్షాకాలం రాకముందే అధికారులు స్పందించి రహదారిని సరిచేయాలి” అని స్థానిక వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments