ప్రభుత్వ భూమిపై ఇటుక బట్టీలు… అధికారుల మౌనం..?
By
Rathnakar Darshanala
ప్రభుత్వ భూమిపై ఇటుక బట్టీలు… అధికారుల మౌనం?
*నర్సింగాపూర్‌లో మళ్లీ అక్రమాల జోరు*
నేటివార్త, జగిత్యాల బ్యూరో, ఏప్రిల్ 27:
జిల్లాలోని నర్సింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు మళ్లీ ఆక్రమణలకు గురవుతున్నాయి. గ్రామ రెవెన్యూ శివారులోని 437 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు “వైట్ కలర్” అండతో ఇటుక బట్టీల ఏర్పాటు కోసం భారీగా మట్టి తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇదే భూమిపై గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగి సుమారు 100 ఎకరాల పట్టాలు రద్దు చేసిన ఘటన ఉన్నప్పటికీ, మళ్లీ అదే భూమిలో అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అధికారుల పర్యవేక్షణలో లోపాలున్నాయా? లేక ఉద్దేశపూర్వకంగా కళ్లుమూస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గ్రామంలోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఈ భూమిని కేటాయించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమంగా జరుగుతున్న ఇటుక బట్టీల ఏర్పాటును వెంటనే నిలిపివేసి, ప్రభుత్వ భూమిని రక్షించాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా? లేక అక్రమాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందా? అన్నది చూడాలి.
Comments