హిందూ ధర్మ రక్షణకు హిందువులంతా ఏకం కావాలి.
By
Rathnakar Darshanala
హిందూ ధర్మ రక్షణకు హిందువులంతా ఏకం కావాలి.
:రాయికల్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం.
నేటివార్త, రాయికల్, ఏప్రిల్ 28: హిందూ ధర్మ రక్షణ కోసం హిందువులందరూ నడుం బిగించి ఏకమవ్వాలని రాధమనోహర్ దాస్ పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాయికల్ మండల కేంద్రంలోని శిశుమందిర్‌లో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు ఏనుగందుల రమేష్, కార్యదర్శి దాసరి గంగాధర్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన రాధమనోహర్ దాస్ మాట్లాడుతూ దేశంలో హిందూ సంఘటన కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించబడిందన్నారు. హిందువులు స్వాభిమానం, దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు.
దేశభక్తి కలిగిన సంస్థగా ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని తెలిపారు. హిందూ చైతన్యంతో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని, పంచపరివర్తన ద్వారా కుటుంబాల్లో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కుటుంబ జీవన విలువలు, సామాజిక సమరసత, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని అన్నారు.
మతం వేరు, ధర్మం వేరని పేర్కొంటూ హిందూ ధర్మం, సంస్కృతిని తెలుసుకుని ఆచరించాలని సూచించారు. కుటుంబం నుంచే పరివర్తన రావాలని, అందులో మహిళల పాత్ర కీలకమని చెప్పారు.
దేవాలయాలను శక్తివంతం చేయాలని, హిందువులు కులాల వారీగా విభజించబడకుండా సమైక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు.
డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మచ్చ జ్యోత్స్న మాట్లాడుతూ ప్రతి ప్రాణి శ్రేయస్సును కోరే సంస్కృతి, సంప్రదాయాలను అందించినది మన సనాతన ధర్మమని అన్నారు.
అనైక్యత కారణంగా ఎన్నో శతాబ్దాలు పరాయి పాలనలో జీవించాల్సి వచ్చిందని, ఇప్పటికైనా హిందువులలో పంచపరివర్తన రావాలని కోరారు.
అనంతరం మహిళలతో గోపూజ కార్యక్రమం నిర్వహించి, కార్యక్రమం ముగింపులో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు నాగార్జున, ఏఎస్ఐ దేవేందర్ నాయక్ ,మహిళలు, చిన్నారులు, యువకులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments