జగిత్యాలలో బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి చేరిక – ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ ప్రకటన.

Rathnakar Darshanala
జగిత్యాలలో బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి చేరిక – ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ ప్రకటన.
 *కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ*

 *బీఆర్ఎస్‌కు జీవన్ రెడ్డి చేరికతో మరింత బలం*

*తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారమే లక్ష్యం*

*మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో అభివృద్ధి గుర్తు చేస్తున్నా*

*రైతుబంధు, యూరియా సమస్యలపై ఆందోళన వ్యక్తం*

*రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన*

*పేదల ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం*

*జగిత్యాల నుంచే పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభం: కేసీఆర్*


  నేటివార్త జగిత్యాల:


జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

సభలోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ధైర్యవంతుడైన నాయకుడని కొనియాడారు. ఆయనతో తనకు చాలా కాలంగా స్నేహ సంబంధాలు ఉన్నాయని, 

పార్టీలు వేరైనా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో జీవన్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయనకు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు స్పష్టంగా సూచించాయని తెలిపారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించడం ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇకపై ఆయన ఉమ్మడి కరీంనగర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. 

జగిత్యాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమించారని ప్రశంసించారు.తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 

కానీ వెనుకడుగు వేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా అభివృద్ధి దిశగా అడుగులు వేశామని చెప్పారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుబంధు చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో రైతులకు విస్తృత సహాయం అందించామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, రియల్ ఎస్టేట్ రంగం క్షీణించిందని తెలిపారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్యలు పెరిగాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 
ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించిన కేసీఆర్, అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. 

రైతుల కోసం కరెంట్ మీటర్లు పెట్టకుండా తాను అడ్డుకున్నానని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయిందని అన్నారు.మొత్తంగా, తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని, అది జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు.

 జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments