రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత గౌరవం కల్పిస్తాం :సీఎం రేవంత్ రెడ్డి.
By
Rathnakar Darshanala
రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత గౌరవం కల్పిస్తాం :సీఎం రేవంత్ రెడ్డి.
పాఠ్యాంశాల్లో చరిత్ర, విగ్రహ ఏర్పాటు అంశాలపై ప్రభుత్వ నిర్ణయం.
రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం ప్రదానం.
తెలంగాణ రైతాంగ పోరాటానికి చిరస్మరణీయ నేతగా ప్రశంసలు.
నేటి వార్త హైదరాబాద్, ఫిబ్రవరి 2 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డి కి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని గౌరవం పెంచే చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం – 2025’ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రావి నారాయణ రెడ్డి జీవితాన్ని సీఎం స్మరించుకున్నారు. అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో రావి నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు.
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేదల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తిత్వమన్నారు. ‘బండెనక బండి కట్టి’ అంటూ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి వంటి వారిని ప్రభావితం చేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆయన పోషించిన పాత్ర, అనుభవం పరిపాలనకు ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్బంగా గుర్తు చేసారు.
హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments