Hyd :కృష్ణా–గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల పరిరక్షణలో రాజీ లేదు:సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం.

Rathnakar Darshanala
కృష్ణా–గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల పరిరక్షణలో రాజీ లేదు:సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం.
- గత తప్పిదాల సవరణకు వ్యూహాత్మక అడుగులు
- శాసనసభ ముందుకు సమగ్ర నదీజలాల సమాచారం
- పాలమూరు–రంగారెడ్డిపై కీలక వాస్తవాలు వెల్లడి
- రాజకీయ లబ్ది కాదు… రాష్ట్ర హితం లక్ష్యం

నేటి వార్త హైదరాబాద్, జనవరి 1 :
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

గతంలో నదీజలాల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం క్రమశిక్షణతో, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. నదీజలాల అంశంలో రాజకీయ లబ్ది కోసం కాకుండా, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న లక్ష్యంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి నదీజలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నదీజలాలపై సమగ్ర సమాచారాన్ని శాసనసభ ముందుంచుతామని, సభ్యులందరూ చర్చలో పాల్గొని స్పష్టత సాధించాలని కోరారు.

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారని, రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 

అంతర్జాతీయ జల వివాదాల ఒప్పందాల ప్రకారం నది పరీవాహన ప్రాంతం మేరకు తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం మేర నీటి వాటా దక్కాల్సి ఉండగా, 

గత ప్రభుత్వ హయాంలో ఇందుకు భిన్నంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం జలాలకు అంగీకరించారని తెలిపారు. ఇది తెలంగాణకు జరిగిన తీవ్రమైన అన్యాయమని స్పష్టం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌కు మార్చడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 13 టీఎంసీలు తరలిస్తుంటే, తెలంగాణ కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే తీసుకోగలుగుతోందని చెప్పారు. 

ప్రాజెక్టు మార్పు వల్ల లిఫ్టులు, పంపులు పెరిగాయే తప్ప ప్రయోజనం లేకుండా పోయిందని, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి కనీసం 2.5 టీఎంసీలు తరలించే మౌలిక వసతులు కూడా తెలంగాణకు లేవని వివరించారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏడేళ్లపాటు డీపీఆర్ సమర్పించకుండానే సుమారు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

డీపీఆర్ లేకపోవడం వల్ల పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయని తెలిపారు. 

దాంతో అప్పటి ప్రభుత్వం ఇది సాగునీటి ప్రాజెక్టు కాదని, తాగునీటి కోసం 7.15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేశారు.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే అన్ని వాస్తవాలను శాసనసభ ముందు ఉంచి స్పష్టత తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన ఈ అంశంపై సమిష్టిగా చర్చించి, తెలంగాణకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comments