శాసనసభలో సమాన హక్కులు ఇవ్వాలి: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు BRS అవకాశం ఇవ్వాలి –KTR.
By
Rathnakar Darshanala
శాసనసభలో సమాన హక్కులు ఇవ్వాలి: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు BRS అవకాశం ఇవ్వాలి –KTR.
- నదీ జలాలపై అవగాహన లేని సీఎం ఉపన్యాసాలా..?
- సాగునీటిలో కాంగ్రెస్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు
నేటి వార్త హైదరాబాద్, జనవరి 1 :
శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
“మీరు మీ వెర్షన్ చెప్పండి, మేము మా వెర్షన్ చెబుతాం. మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వండి అని మాత్రమే కోరుతున్నాం” అని అన్నారు.
గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయం, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
అయితే నదీ జలాలు, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున భాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారని, అది హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని విమర్శించారు.
దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్‌లో ఉందో కూడా తెలియని సీఎం గారితో గోదావరి–కృష్ణా జలాలపై చర్చ చేయాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాగునీటి రంగంలో ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా? అంటూ కేటీఆర్ నిలదీశారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటికీ మృతదేహాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు.
సుంకిశాల ప్రాజెక్ట్ కూలిపోయినా సరైన సమాధానం చెప్పలేకపోయిందని, బాధ్యులైన ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలన్న సిఫార్సుపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు.
“మేము మీ దగ్గర ఏమి నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్‌లో చూపిస్తారా?” అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2016 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభను బాయ్‌కాట్ చేసి, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
“అప్పుడు తప్పు అన్నది, ఈరోజు ఎలా సరైనదిగా మారింది?” అని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చామని, వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించిన కేటీఆర్, ముఖ్యమంత్రి తరచూ “పండబెట్టి తొక్కుతాం” అంటారని, నిజంగా ఆ పథకాన్ని పక్కన పెట్టి తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments