ADB :బేల రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ధర్నా.
By
Rathnakar Darshanala
ADB :బేల రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ధర్నా.
నేటి వార్త ఆదిలాబాద్ –జనవరి 2 :
రంగు మారిన సోయాబీన్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలోని బేల రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ ఆందోళనతో బేల రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, జిల్లాలో రైతులు పండించిన సోయాబీన్, పత్తి పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు.
రంగు మారిందని, తేమ ఎక్కువగా ఉందని కారణాలు చెబుతూ అధికారులు పంట కొనుగోళ్లను నిరాకరిస్తున్నారని ఆరోపించారు.
పంట కొనుగోళ్లలో అనవసర నిబంధనలు విధించి రైతులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయాలంటూ రైతులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రంగు మారిన పంటలను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులను ఆదుకునే పరిస్థితి లేదని, ఇది దురదృష్టకరమన్నారు.
ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు తప్పనిసరిగా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు పంటలను అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు.
దీంతో ఒక్కో రైతు వేల రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు. తేమ పేరుతో పత్తి కొనుగోళ్లను సంబంధిత సంస్థలు తిరస్కరిస్తుండటంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు.
యాసంగి పంటలకు సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటి సమస్యలతో కూడిన ఈ పరిస్థితి రైతులను అప్పులపాలుచేస్తోందని జోగు రామన్న తెలిపారు.
రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం కూడా అన్యాయమని విమర్శించారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం లేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని జోగు రామన్న స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments