బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం… అసెంబ్లీ బహిష్కరణ.
By
Rathnakar Darshanala
బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం… అసెంబ్లీ బహిష్కరణ.
నేటి వార్త హైదరాబాద్ – జనవరి 2 :
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. గన్‌పార్క్ వద్ద మాట్లాడుతూ, స్పీకర్ మరియు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా సభను నడుపుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బీఏసీ సమావేశానికి ప్రభుత్వం గంటన్నర ఆలస్యంగా రావడాన్ని తప్పుబట్టారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
పార్లమెంటులో ప్రధాన నాయకులపై విమర్శలు జరిగితే అవి సహించబడుతున్నాయని, అదే విధంగా అసెంబ్లీలో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లాగా, సీఎల్పీ సమావేశంలాగా మార్చారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాటల తీరుతో సభను అవమానిస్తున్నారని, మూసీ దుర్వాసనకంటే ముఖ్యమంత్రి నోటివెంట వచ్చే మాటల దుర్వాసనే ఎక్కువని తీవ్రంగా విమర్శించారు.
ముఖ్యమంత్రి పదవికి తగిన హుందాతనం కనిపించడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణకు, నీళ్లకు ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, ప్రతి పనిలో కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేస్తున్నారని పేర్కొంటూ, ఈ అన్యాయాలకు నిరసనగా శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని హరీష్ రావు ప్రకటించారు.
Comments