నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి.

Rathnakar Darshanala
నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి.
నంద్యాల ప్రతినిధి నేటి వార్త అక్టోబర్ 30:

తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్ని మండలాల్లో కూడా పంట నష్టం అంచనాలను రైతుల వారీగా ఏపీ ఏఐఎంఎస్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 

గురువారం బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరు, ఏ.కోడూరు గ్రామాలలోని రైతు పంట పొలాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు తన పంట నష్టం వివరాలను గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా “ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం'' యాప్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. 

ఏ రైతు కూడా ఈ ప్రక్రియలో మినహాయించబడకూడదని, పంట నష్టం అంచనాలు 100 శాతం ఖచ్చితంగా ఉండేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. 

తుఫాన్ ప్రభావంతో పొంగిన వాగులు, వంకల నీరు రైతుల పొలాల్లోకి ప్రవహించడంతో విస్తారమైన పంట నష్టం సంభవించిందన్నారు. రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని, వారికి తగిన భరోసా కల్పించారు. 

గ్రామస్థాయి బృందాలు ప్రతి రైతు పొలాన్ని సందర్శించి నష్టం వివరాలను నమోదు చేసి, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు..

ఈ కార్యక్రమాన్ని రెండు రోజులలోపే పూర్తి చేసి, తుది జాబితాను సామాజిక తనిఖీ నిమిత్తం ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రదర్శించాలన్నారు.కలెక్టర్ సంత జూటూరు, 

ఏ.కోడూరు గ్రామాల్లోని పంట పొలాల్లో నిలబడి పంటల స్థితిని, నీటి మునిగిన పొలాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి పొలం దగ్గర రైతులతో మాట్లాడుతూ, వరి పంట దెబ్బతిన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. 

మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కలెక్టర్ వెంట ఉన్నారు.
Comments