భారీ వర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. జిల్లా ప్రత్యేక అధికారి.
By
Rathnakar Darshanala
భారీ వర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. జిల్లా ప్రత్యేక అధికారి.
**ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణ , ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి*
*వర్షాలకు సంబంధించి ప్రతి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి తక్షణ చర్యలు చేపట్టాలి*
*సాత్నాల, మత్తడి వాగు, పెన్ గంగ, ఛనక ప్రాజెక్టుల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి*
*ముఖ్యంగా గిరిజన మారుమూల ప్రాంతాల ప్రజల పై ప్రత్యేక దృష్టి సారించాలి*
*వేడి చేసిన నీటిని తాగేలా అవగాహన కల్పించాలి*
*ట్యాంకులను శుభ్రం చేయాలి*
**ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి రాష్ట్ర ఆబ్కారీ కమిషనర్ సి. హరికిరణ్*
నేటి వార్త ఆదిలాబాద్ :
గత మూడురోజులుగా ఏకధాటిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి,
రాష్ట్ర ఆబ్కారీ కమిషనర్ సి. హరికిరన్ అధికారులకు సూచించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన జిల్లా పాలనాధికారి రాజర్షి షా తో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,
ముఖ్యంగా జిల్లాలో గల శివ సాగర్ ప్రాజెక్ట్, కల్వర్టులు, వంతెనలు తదితర ఏరియాలలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు.
పరీవాహక ప్రాంతంతో పాటు కాలువలు, చెరువులు, ఇతర జలాశయాలలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా, ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.
వరద జలాలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
ఇటీవలే జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న సంఘటనలు నెలకొన్నాయని గుర్తు చేస్తూ, అలాంటి ప్రదేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపించేలా చూస్తామని, స్థానిక పరిస్థితుల గురించి జిల్లా యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి నెలకొంటే సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ఆన్నారు.
పురాతన, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని , వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచే ప్రాంతాల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు.
ఎక్కడ కూడా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచాలని,
గ్రామాల్లో ఫిఫర్ సర్వే నిర్వహించి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, అతిసారం వంటివి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,
ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆన్నారు.
వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ తో పాటు అగ్నిమాపక శాఖ, పోలీస్, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్
18004251939 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు.
భారీ వర్షాల పరిస్థితి గురించి వాతావరణ శాఖ అందిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నామని అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానికులను తరలించేలా పునరావాస కేంద్రాలను కూడా గుర్తించి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.
ప్రాజెక్టులు, రిజర్వాయర్ లు, చెరువులలో వచ్చి చేరుతున్న వరద జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు.
జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, అన్ని విక్రయ కేంద్రాల్లో స్టాక్ వివరాలతో కూడిన బోర్డు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, rdo స్రవంతి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments