తనువు చాలించినా... చూపు మాత్రం సజీవం..!

Rathnakar Darshanala
తనువు చాలించినా చూపు మాత్రం సజీవం..!
నేత్రదానంతో ఇద్దరు అంధులకు వెలుగు 

నేటి వార్త జులై 24 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం జరిగింది ఒక మనసు ద్రవించే సంఘటన. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు కంటి చూపు లభించింది. దానం చేసిన కుటుంబ సభ్యుల ఆదర్శం పలువురికి స్ఫూర్తినిచ్చింది.

కాకతీయ నగర్‌కు చెందిన కొత్తపల్లి రమేష్ (44) ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో కాంట్రాక్ట్ సపోర్టింగ్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

గురువారం తెల్లవారుజామున వాంతులు, కడుపునొప్పితో బాధపడిన రమేష్ తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మృతుడి కుటుంబానికి నేత్రదానంపై అవగాహన కల్పించారు. తండ్రి కనకయ్య, సోదరులు శంకర్, సురేష్, సోదరి జ్యోతి నేత్రదానానికి అంగీకారం తెలిపారు. 

ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు.
లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కజాంపురం రాజేందర్, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కె.ఎస్. వాసు ప్రశంసిస్తూ కుటుంబానికి అభినందన పత్రం అందించారు. 

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ నేత్రదానం గొప్ప పుణ్యకార్యం. రమేష్ కుటుంబం అందరికీ ఆదర్శం. ప్రతి ఒక్కరు ఈ కుటుంబాన్ని చూసి నేత్రదానానికి ముందుకు రావాలి" అని అన్నారు
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ పట్టణ కార్యదర్శి బోళ్ల చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు మూల శంకర్, ఆర్ఎంపీ రమేష్ పాల్గొన్నారు.

నివాళులర్పించిన ఆరోగ్య సిబ్బంది
రామగుండం అర్బన్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల వైద్య సిబ్బంది రమేష్ అకాల మరణంపై తీవ్ర సంతాపం తెలిపారు. మృతుని పార్థివదేహాన్ని జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్-ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్. సురేష్ నాయక్ సందర్శించి నివాళులర్పించారు

నేత్రదానంపై అభినందనలు వెల్లువెత్తినవె
రమేష్ కుటుంబం చూపిన ఉదాత్తత్వాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, కార్యదర్శి భీష్మాచారి, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు పి. మల్లికార్జున్, అధ్యక్షుడు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్ తదితరులు అభినందించారు.
రమేష్ అకాల మరణం పట్ల వారు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments