Hyd :సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కడ్ బందిగా నిర్వహించాలి.ఉప ముఖ్యమంత్రి.
By
Rathnakar Darshanala
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కడ్ బందిగా ర్వహించాలి.ఉప ముఖ్యమంత్రి.
హైదరాబాద్ డెస్క్ నేటి వార్త :
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సూచించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, సందీప్ కుమార్ సుల్తానియా లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్ష్యాలు, విధివిధానాలు, కార్యాచరణ గురించి వివరిస్తూ, సర్వే విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు.
ఎంతో ప్రాధాన్యతతో కూడిన ఈ కార్యక్రమంలో అందరిని భాగస్వాములు చేస్తూ సర్వేను సమగ్రంగా జరిపించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడాలన్న సమున్నత ఆశయంతో ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోందని అన్నారు.
సర్వే కోసం ఆయా బ్లాక్ ల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను గుర్తించాలన్నారు. 2011 జనాభా గణన అనుసారంగా ఎన్యూమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేసుకోవాలని,
కొత్తగా ఏర్పడిన కాలనీలు ఉంటే బ్లాక్ లను అప్ డేట్ చేసుకోవాలని అన్నారు. 150 కుటుంబాలకు ఒకరు చొప్పున ఎన్యుమరేటర్లకు నియమించాలని,
పది మంది ఎన్యుమరేటర్లకు ఒకరు చొప్పున సూపర్వైజర్లను సర్వే ప్రక్రియ పర్యవేక్షణ కోసం గుర్తించాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ చెల్లించడం జరుగుతుందన్నారు.
ఏ ఒక్క కుటుంబం సైతం మినహాయించబడకుండా ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్ లో ఇంటింటి సర్వే జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రణాళిక శాఖ ఈ సర్వేకు నోడల్ విభాగంగా వ్యవహరిస్తుందని, క్షేత్రస్థాయిలో ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ గా జిల్లా స్థాయి అధికారిని నియమించాలని,
అదనపు కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరించాలని, సర్వే విజయవంతానికి కలెక్టర్లు స్వీయ పర్యవేక్షణ జరపాలని సూచించారు.
ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలను కూడా సర్వే సందర్భంగా సేకరించాలన్నారు. ఎన్యుమరేటర్లు,
సూపర్వైజర్లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పించాలని, సర్వే నిర్వహణ కోసం అవసరమైన మెటీరియల్ ను ఎన్యుమరేటర్లకు సమకూర్చాలని అన్నారు. సర్వే కోసం ఎన్యుమరేటర్లు వచ్చే సమయానికే ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పాస్ బుక్కులను వారి దగ్గర ఉంచుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
సర్వే కోసం వెళ్లిన సమయంలో ఎన్యుమరేటర్లు హుందాగా వ్యవహరించాలని, సర్వే ప్రధాన ఉద్దేశ్యాన్ని తెలియజేయాలని,
ప్రశ్నావళికి అనుగుణంగానే సమాచారం సేకరణ జరపాలన్నారు. సమాచారాన్ని ఆన్ లైన్లో నిక్షిప్తం చేసేందుకు సరిపడా ఆపరేటర్లను నియమించి వారికి శిక్షణ ఇప్పించాలన్నారు.
ఆన్ లైన్లో వివరాల నమోదులో తప్పిదాలు, లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని, సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు.
సర్వేకు సంబంధించిన ప్రగతిని రోజువారీగా పర్యవేక్షించాలని, అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విజయవంతానికి కృషి చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, జడ్పి సీఈఓ జితెందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Comments