అక్రమ నిర్మాణం...అంధకారంలో నల్లగండ్ల.

Rathnakar Darshanala
అక్రమ నిర్మాణం...అంధకారంలో  నల్లగండ్ల.
*-కూలిన పరదాలు, కర్రలు.. తప్పిన పెనుప్రమాదం*

*-అధికారుల నిర్లక్ష్యం... ప్రజల ప్రాణాలకు శాపం*

నేటి వార్త, శేరిలింగంపల్లి:

అసలే వర్షకాలం ఒక పక్క మూడు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసిన మ్యాన్ హోల్స్ పొంగి ప్రవహిస్తున్నాయి, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. 

అటు అధికారులు ఇటు పాలకులు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారిచేస్తున్న కొంత మంది అత్యాశపరులు ఇవేమి పట్టనట్టు తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు.

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రికి ఎదురుగా ఓ నిర్మాణదారుడు భవన నిర్మాణం చేపట్టాడు. ప్రధాన రహదారికి ఆనుకొని దాదాపు 100 గజాల విస్తీర్ణంలో అత్యాశతో ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టాడు.

 తన అక్రమ నిర్మాణం బయటకు కనిపించకుండా  పరదాలు కట్టాడు. కాగా నిర్మాణం బయటికి కనిపించకుండా కట్టిన పరదాలు ప్రమాదానికి దారి తీసింది. 

కురుస్తున్న వర్షాలు ఈదురుగాలులతో పరదాలు కర్రలు విరిగి భవనం ముందున్న హై టెన్షన్ తీగల మీద పడిపోవడంతో ఒక్కసారిగా భారీ శబ్దం, మంటలతో విద్యుత్ సరఫరా స్థానికంగా నిలిచిపోయింది. 

ప్రమాదం జరిగే సమయంలో భవనం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు నిర్మాణదారుడి  అత్యాశ, నిర్లక్ష్యం కారణంగా నల్లగండ్ల ప్రాంతంలో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నీలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు  ఇటువంటి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments