ఆగస్టు నెలలో సోయాచిక్కుడులో చెయ్యవలసిన సేద్యపు పనులు తెలుసుకుందాం.

Rathnakar Darshanala
ఆగస్టు నెలలో సోయాచిక్కుడులో చెయ్యవలసిన సేద్యపు పనులు తెలుసుకుందాం.
• సోయాచిక్కుడు ప్రస్తుతం శాఖీయ దశ నుండి పూత మొదలయ్యే దశలో ఉంది.

• గత మాసంలో కురిసిన అధిక వర్షాల వలన కొన్ని ప్రాంతాలలో నీటి ముంపు లేదా మురుగు నీటి సమస్య ఏర్పడి మొక్క ఎదుగుదల తగ్గడం మరియు పోషకాల లోపాలు గమనించడం
జరిగింది.

• ప్రధాన పోషక లోపాల నివారణకు 10 గ్రా. 19.19. 19 లేదా 20. 20.20 లేదా 13.0.45 లేదా 20 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

• అలాగే వేరుకుళ్ళు తెగులు ఆశించి మొక్కలు చనిపోవడం గమనిస్తే లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ మందుతో మొక్క చుట్టూ భూమిని తడపాలి.

సోయా పంటలో పిలకదశ నుండి గింజ దశ వరకు కాండం ఈగ, కాండం తొలుచు పురుగు మరియు తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

కాండం తొలిచే ఈగ నివారణకు 5 మి.లీ. వేపనూనె 1500 పిపియం. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే ఉధృతిని అదుపు చేయడానికి ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు మరియు తెలుపు రంగు జిగురు అట్టలు పంటలో అమర్చాలి.

• కాండం తొలిచే ఈగ మరియు కాండం తొలుచు పురుగు ఉధృతిని బట్టి నివారణకు 1.25 మి.లీ. బీటాసైఫుథ్రిన్ + ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.4 మి.లీ. థయోమిథాక్సామ్ 12.6% + లామ్డా సైహలోత్రిన్ 9.5% జెడ్సి లేదా 0.5 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను. 

• తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటే, పైన తెలిపిన సింథటిక్ పైరిథ్రాయిడ్స్ పిచికారి చేయకూడదు. వీటికి ప్రత్యామ్నాయంగ 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.

• ప్రస్తుత పంట కాలంలో పల్లాకు తెగులు సమస్య అక్కడక్కడా గమనించడం జరిగింది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. పసుపురంగు జిగురు అట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చినట్లైతే తెల్లదోమ ఉధృతిని అదుపుచేయవచ్చు. 

తెల్లదోమ నివారణకు 0.2 గ్రా. ఎసిటామిప్రిడ్ 20% ఎస్పి లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లైతే 1.25 మి.గ్రా. డయాఫెంథీయురాన్ 50% డబ్ల్యుపి లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.

• సోయా పంటలో ఆశించే తెగుళ్ళలో ఎక్కువగా పూత దశ నుండి ఆశించడం జరుగుతుంది. ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ మరియు కాయకుళ్ళు తెగులు, మసి బొగ్గు తెగులు మరియు రైజోక్టోనియా, 

బాక్టీరియల్ బ్లైట్ తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది. ఈ తెగుళ్ళ నివారణకు, 2.5 గ్రా. టెబ్యుకొనజోల్ 10% + సల్ఫర్ 65% డబ్ల్యుజి లేదా 1 గ్రా. టెబ్యుకొనజోల్ లేదా 1 మి.లీ. ప్రొపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.

• బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సున్నిత దశ, పుష్పించు దశలో నీటి తడి ఇచ్చినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చు. సోయాచిక్కుడు విత్తనోత్పత్తి చేసే రైతులు మొక్కల ఆకునిర్మాణం, పూత రంగు మరియు ఎదుగుదలలో తేడాలను గమనించి బెరుకులను ఏరివేయాలి.
Comments