గిరి'పుత్రున్ని వరించిన ప్రభుత్వ ఉద్యోగం.

Rathnakar Darshanala
గిరి'పుత్రున్ని వరించిన ప్రభుత్వ ఉద్యోగం.

నేటివార్త , ఖానాపూర్ రూరల్ 

(ఏప్రియల్26):ఆదివాసీ గ్రామమైన కొలాంగూడ గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిగూడలో నివాసముంటున్న గిరిజన కుటుంబంలోని యువకుడిని ప్రభుత్వ ఉద్యోగం వరించింది.

కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పైచదువులకు వెళ్ళలేకపోయిన,చదివిన తరగతులను బట్టి  ఉద్యోగాలను వెతుక్కుంటూ ఉద్యోగ సాధనే ధ్యేయంగా సిద్ధమయ్యాడు.

పేదరికాన్ని సైతం ఎదిరించి,పరిస్థితులను అధిగమించేలా చేసిన కష్టమే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సాధనకు కారణమయ్యింది.పట్టుదలతో చదివిన ఆ చదువే ఇవాళ ప్రభుత్వ కొలువైనా సబార్డినేట్ ఉద్యోగం సాధించేలా చేసింది.

ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిగూడకి చెందిన నిరుపేద కుటుంబమైనా ఆత్రం గోపీచంద్ సిందుబాయి దంపతుల కుమారుడైన రమేష్ ప్రాథమిక విద్యను స్థానిక కొలాంగూడ గ్రామ పాఠశాలలో చదివాడు.

ఉన్నత తరగతులైనా 6వ తరగతి నుండి పదవ తరగతి పూర్తి చదువును ఉట్నూర్ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు.కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుటుంబానికి సహాయంగా ఉంటూ,కూలీ పనులు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం కోర్టు సబార్డినేట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ క్రమంలోనే కుటుంబం ఆర్థిక పరిస్థితులు,తల్లిదండ్రుల కష్టం తెలిసిన ఆ యువకుడు ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇంటివద్దనే చదివి ఉద్యోగానికి ప్రిపేరయ్యి,పరీక్ష రాశాడు.

ఇటీవల ప్రభుత్వం కోర్టు సబార్డినేట్ ల ఫలితాలు విడుదల చేయగా,ఫలితాల్లో ప్రభుత్వ కొలువైన కోర్టు సభార్డినేట్ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కలను,తన కలను సాకారం చేసుకున్నాడు.

ఉద్యోగాల కోసం లక్షలు వెచ్చించి పట్టణాలలో కోచింగులు తీసుకుంటున్న ఈ తరంలో ఇంటివద్దనే చదువుకుని ప్రభుత్వం ఉద్యోగం సాధించడం మామూలు విషయమేమీ కాదు.గిరిజన యువకుడు ప్రభుత్వ కొలువు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు,

మనసుంటే మార్గముంటుందన్నట్లుగా.ఈ సంధర్బంగా ఆత్రం రమేష్ ప్రభుత్వ కొలువు సాధించడం పట్ల, యువకుడి తల్లిదండ్రులు,కుటుంబం, కొలాంగూడ,దేవునిగూడ గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments