ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విపక్షాల ఆగ్రహం.
By
Rathnakar Darshanala
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విపక్షాల ఆగ్రహం.
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్..
నేటివార్త, సెప్టెంబర్ 01: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
వెయ్యి రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అప్పులు, అవినీతి పెరిగిపోయాయని ఆరోపించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, బీజేవైఎం ఆందోళన చేస్తుంటే భయపడి బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ గుండాయిజానికి నిదర్శనంగా బీజేపీ ప్రధాన కార్యాలయంపై, నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయడం సిగ్గుమాలిన, పిరికిపంద చర్య అని అన్నారు.
గత నెల రోజులుగా బీజేవైఎం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, విషయాన్ని పక్కదారి పట్టించేందుకే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మీ దాడులకు భయపడేవారు బీజేపీ నాయకులు కాదని,
ధర్మం, దేశం కోసం అవినీతిపై ఎన్నో పోరాటాలు చేశామని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments