నేత్రదానంపై అపోహలు వీడి.. అవగాహన పెంచాలి.
By
Rathnakar Darshanala
నేత్రదానంపై అపోహలు వీడి.. అవగాహన పెంచాలి.
తెలంగాణలో కార్నియా సేకరణ పెంచేందుకు అన్ని స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి: రామ్ కళ్యాణ్ చల్లా
సంతోష్‌నగర్, ఆగస్టు 31(నేటి వార్త): 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్‌లో నేత్రదాన అవగాహన కార్యక్రమం, అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘బీ ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ రామ్ కళ్యాణ్ చల్లా హాజరై నేత్రదానం ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా రామ్ కళ్యాణ్ చల్లా మాట్లాడుతూ.. నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి వెలుగును అందించే అవకాశం లభిస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పిడి చేయగల కార్నియాల సేకరణను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేత్రదానానికి సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంతోష్, డాక్టర్ తస్లీమ్ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అపనమ్మకాలపై అవగాహన కల్పించారు.
నేత్రదానంపై సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా మరింత మంది దాతలను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రతి విలువైన కార్నియా దానం సేకరించేందుకు మరింత మంది శిక్షణ పొందిన టెక్నీషియన్లు, అదనపు ఐ కలెక్షన్ సెంటర్లు అవసరమని తెలిపారు.
అనంతరం నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్య బృందం, డాక్టర్ సంతోష్, డాక్టర్ తస్లీమ్‌తో పాటు రెహ్మాన్, తేజ, నవీన్ శరవణన్, మధు నరముల, అరవింద్, వాసన్ ఐ బ్యాంక్ బృందం, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments