వృక్షానికి రాఖీ...ప్రకృతికి రక్ష.

Rathnakar Darshanala
వృక్షానికి రాఖీ...ప్రకృతికి రక్ష.
• మంచినీళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు రాఖీ వేడుకలు

మంచినీళ్లపల్లి: రాఖీ పండుగను పురస్కరించుకుని మంచినీళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఈసారి పర్యావరణ పరిరక్షణకు అనుసంధానం చేస్తూ వినూత్నంగా నిర్వహించారు.విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పూల రాఖీలను ఒకరికొకరు కట్టుకున్నారు.

అనంతరం పాఠశాల ఆవరణలోని మొక్కలు,వృక్షాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రాఖీలు కట్టి “వృక్షానికి రాఖీ – ప్రకృతికి రక్ష” అనే సందేశాన్ని చాటారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దిలీప్ మాట్లాడుతూ.. రాఖీ కేవలం సోదర,సోదరీమణుల మధ్య రక్షణకు ప్రతీక మాత్రమే కాదని,మనకు జీవనాధారంగా నిలుస్తున్న ప్రకృతిని,వృక్షాలను కాపాడాలనే బాధ్యతను గుర్తు చేసే పండుగగా మలచుకోవాలని అన్నారు.

చెట్లు స్వచ్ఛమైన గాలి,నీడ,ఆహారం అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయని తెలిపారు.

రాఖీ కట్టిన ప్రతి మొక్కను ఒక విద్యార్థి సంరక్షించేలా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం,వాటికి ఎలాంటి హాని కలగకుండా చూడడం వంటి బాధ్యతలను విద్యార్థులు స్వీకరించారు.

“మొక్క నాటడం ఎంత ముఖ్యమో.. నాటిన మొక్కను వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించడం అంతకంటే ముఖ్యం. 
చెట్టును కాపాడితే.. చెట్టు మనల్ని కాపాడుతుంది” అనే సందేశాన్ని విద్యార్థులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమాశంకర్,ఇతర ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొని మొక్కలకు రాఖీలు కట్టి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. 

వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించింది.
Comments