Bigg Breaking :మైన్స్ ఏడీ నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు.

Rathnakar Darshanala
Bigg Breaking :మైన్స్ ఏడీ నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు.
* 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు.. నగదు, బంగారం, ఆస్తి పత్రాల పరిశీలన

ములుగు/భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం.

భూపాలపల్లి, ములుగు, వరంగల్, హైదరాబాద్‌లోని బోడుప్పల్‌తో పాటు సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

జయరాజుకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం లభించినట్లు సమాచారం. 

ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

*గతంలోనూ అవినీతి ఆరోపణలు*

ఇదిలా ఉండగా, బొజ్జ జయరాజు గతంలో ములుగు జిల్లా మైన్స్ ఏడీగా పనిచేసిన సమయంలో ఇసుక, మట్టి క్వారీల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తినట్లు సమాచారం. 
క్వారీలు, ఇసుక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏసీబీ నిర్వహిస్తున్న సోదాలతో గతంలో వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 

అయితే గతంలో వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం సోదాల్లో లభించిన ఆస్తులపై ఏసీబీ అధికారికంగా వెల్లడించే వివరాల ఆధారంగానే పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
Comments