అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొంగులేటి.

Rathnakar Darshanala
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.

నేటివార్త, జగిత్యాల బ్యూరో, ఆగస్టు 21:


కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో తొలి దశలో రూ.32 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించామని, రెండో దశలో పాఠశాల ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

కాలనీలో రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

భూ రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఏడాదిన్నరలో రీ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని, నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూకలపల్లి కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.72 కోట్లు మంజూరు చేసిందన్నారు. ధర్మపురి రెవెన్యూ డివిజన్‌తో పాటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.

మాల్యాల మండలంలో చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ నూకలపల్లి కాలనీలో రహదారులు, రేషన్ దుకాణం, ఇతర మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కోరారు. 

కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 10,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,208 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఇప్పటివరకు 8,079 మంది లబ్ధిదారులకు రూ.227.32 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

కార్యక్రమం ముగింపులో చెరువులో మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. 

అనంతరం 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments