జస్టిస్ ఫర్ రూపారెడ్డి.. న్యాయం జరిగే వరకు పోరాటం.

Rathnakar Darshanala
జస్టిస్ ఫర్ రూపారెడ్డి.. న్యాయం జరిగే వరకు పోరాటం.
నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి ఆగష్టు 22:: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డిపై జరిగిన దారుణ దాడి, హత్యను నిరసిస్తూ తానూర్ మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, 

ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ రూపారెడ్డి అనే నినాదంతో రోడ్డెక్కి  ర్యాలీ నిర్వహించారు.

తానూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, కరస్పాండెంట్లు, పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. 

రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మౌనం పాటించారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించి, రూపారెడ్డికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్పే ప్రిన్సిపాల్‌పై ఇలాంటి అమానుష దాడి చేసి హత్య చేయడం అత్యంత దారుణమని అన్నారు. 

పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కల్పించడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యా సిబ్బందికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రూపారెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం, పోలీసు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ర్యాలీ అనంతరం రూపారెడ్డి హత్యకు బాధ్యులైన దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదు అందజేశారు.

 నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

కార్యక్రమంలో తానూర్ మండలంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కరస్పాండెంట్లు, యాజమాన్యాల ప్రతినిధులు  పాల్గొన్నారు.
Comments