అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేకు రాయికల్ అభివృద్ధి కనిపించదా..?
By
Rathnakar Darshanala
అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేకు రాయికల్ అభివృద్ధి కనిపించదా..?
* మూడేళ్లుగా అసంపూర్తి పనులే..
* బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన నిధులతో పనులు పూర్తి చేయాలి.
: దావ వసంత సురేష్
రాయికల్: అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు రాయికల్ పట్టణ,మండల అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదని జగిత్యాల జిల్లా తొలి తాజా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు.
రాయికల్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
భూపతిపూర్–వీరాపూర్ మధ్య 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 2023లో రూ.2.80 కోట్లతో శంకుస్థాపన చేసినా.. మూడేళ్లు గడిచినా పనులు ముందుకు సాగలేదన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రజల రవాణా సౌకర్యం కోసం నిధులు మంజూరు చేసినా పనులు అసంపూర్తిగా ఉండటం దారుణమన్నారు.
ప్రభుత్వం మారినా గతంలో మంజూరైన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
*డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు పూర్తి చేయరు?*
రాయికల్ పట్టణంలో సుమారు 60 డబుల్ బెడ్‌రూం ఇళ్లు అసంపూర్తిగా ఉండి నిరుపయోగంగా ఉన్నాయని దావ వసంత సురేష్ అన్నారు.
పదేళ్ల క్రితమే లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల బిల్లులను కూడా పెండింగ్‌లో ఉంచకుండా చెల్లించాలని కోరారు.
*బ్రిడ్జిలు.. రహదారులదీ అదే పరిస్థితి*
మైతాపూర్ లెవల్ బ్రిడ్జి, రాయికల్–రామోజీపేట బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు.
మూటపల్లి–కొత్తపేట బ్రిడ్జికి రూ.50 లక్షలు, మోరపెల్లి–సింగరావుపేట లెవల్ బ్రిడ్జికి రూ.50 లక్షలు కేటాయించినా పనులు పూర్తికాలేదన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో రాయికల్ మున్సిపాలిటీకి మంజూరైన సుమారు రూ.15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
*ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలి*
ప్రజలకు అవసరమైన ఆర్డీవో కార్యాలయాన్ని పట్టణంలో ఏర్పాటు చేయకుండా ఎమ్మెల్యే ఇంటి సమీపంలో శంకుస్థాపన చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి, పోతారం గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.
అభివృద్ధి కోసం పార్టీ మారామని చెప్పే ఎమ్మెల్యే.. రాయికల్ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన పనులే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు.
సమావేశంలో బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు బర్కం మల్లేష్ అనిల్, మాజీ ఏఎంసీ చైర్మన్ మారంపెల్లి రాణి సాయికుమార్, కౌన్సిలర్ రాకేష్ నాయక్, నాయకులు రమాపతి రావు, గంగారెడ్డి, రాంప్రసాద్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments