Hyderabad :జూన్ 30న మధిరలో రైతు భరోసా నిధుల విడుదల.

Rathnakar Darshanala
జూన్ 30న మధిరలో రైతు భరోసా నిధుల విడుదల. 
హైదరాబాద్, నేటి వార్త: 

వానాకాలం పంటల సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 

ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో భారీ రైతుల సమ్మేళనం నిర్వహించి, అదే వేదికపై రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించనున్నారు. 

నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతులను ప్రోత్సహించేందుకు బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 రకాల సన్న ధాన్యాలకు బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ ఏడాది రాష్ట్రంలో రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశారని, ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మంత్రులు తెలిపారు. 

అయితే కేంద్రం తెలంగాణ నుంచి తక్కువ ధాన్యం సేకరిస్తోందని, మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
 వానాకాలానికి అవసరమైన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని, రామగుండం ఎఫ్‌సీఐ యూరియాలో అధిక భాగం రాష్ట్రానికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర అనుమతులు, నిధులు కోరారు. జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించారు.

 208 కేంద్రాల్లో 2.95 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క తెలిపారు.
Comments