వ్యాధుల నివారణకు పగడ్బందీ చర్యలు
భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌వో డా. రాజేందర్ ఆదేశాలు
నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి జులై 30: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు నియంత్రణ, నివారణ చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. రాజేందర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
శుక్రవారం జూమ్ సమావేశం ద్వారా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, వర్షాల కారణంగా ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని సూచించారు.
అధిక వర్షాల వల్ల రహదారి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉన్న గ్రామాల్లో గర్భిణులను ముందస్తుగా బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు తరలించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.
అలాగే, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.