వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలి : AP సీఎం చంద్రబాబు నాయుడు.

Rathnakar Darshanala
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలి : AP సీఎం చంద్రబాబు.
నేటి వార్త ఆంధ్రప్రదేశ్ :

* ఎల్‌నినో ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్ష.
* ప్రకృతి సేద్యం, పంట మార్పిడికి ప్రోత్సాహం.
* రైతుల సమస్యల పరిష్కారానికి కీలక ఆదేశాలు.

అమరావతి, జూన్ 17 : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 

సచివాలయంలో వ్యవసాయ, ఉద్యానవనం, ఆక్వా రంగాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

 గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు పంట మార్పిడిపై తగిన సూచనలు, సలహాలు అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సర్టిఫికేషన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను రైతులకు వివరించాలని, 

ఈ అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అవసరమైతే తాను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. 

మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

పొగాకు కొనుగోలుదారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, గిట్టుబాటు ధర లభించే వరకు పంట నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

అధిక డిమాండ్ ఉన్న పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం అందేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. 

వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.

 ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

 సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments