ADB :వైభవంగా శంకరాచార్యుల జయంతి వేడుకలు.

Rathnakar Darshanala
వైభవంగా శంకరాచార్యుల జయంతి వేడుకలు.
రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు.

నేటి వార్త ఆదిలాబాద్ :

జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని మంగళవారం ఆదిలాబాద్ లో భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. 

స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణలో మఠాధిపతి యోగానంద సరస్వతి పర్యవేక్షణలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొలుత వైదిక పురోహితుల ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ వేదోక్త మంత్రోచ్ఛారణల నడుమ లక్ష్మీగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

 ఈ ఆధ్యాత్మిక క్రతువులో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులు పాల్గొని పూర్ణాహుతిని నిర్వహించారు. 

మఠాధిపతి యోగానంద సరస్వతి చైర్‌పర్సన్ దంపతులకు వేదాశీర్వచనాలు పలికి, శంకరాచార్యుల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

 పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆదిశంకరాచార్యులను దర్శించుకుని, హోమం కార్యక్రమంలో పాల్గొని భక్తిప్రపత్తులను చాటుకున్నారు. 

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ, కులం మతం బేధాలను వీడి మనుషులందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడని తెలియజెప్పిన మహాపురుషుడు ఆదిశంకరులు అన్నారు. 

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం సాక్షాత్తూ శంకరుడే ఆదిశంకరాచార్యుల రూపంలో అవతరించి ఎన్నో వైదిక ధర్మాలను మనకు అందించారని, ఎనిమిదేళ్ల చిన్న వయస్సులోనే వేదాలను అవపోసన పట్టి సన్యాసాన్ని స్వీకరించిన మహనీయుడని కొనియాడారు. 

అనంతరం పట్టణంలోని రాంలీలా మైదానంలో గల దక్షిణముఖ హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. 
మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులు ఆలయానికి హాజరై ప్రత్యేక పూజలు చేసి, దీక్షదారులకు భోజనం వడ్డించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు గంగన్న, పోతారెడ్డి, నాయకులు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments