ఇక హైవేలపై ప్రయాణం మరింత సురక్షితం.

Rathnakar Darshanala
ఇక హైవేలపై ప్రయాణం మరింత సురక్షితం.
- ఎన్‌హెచ్‌ఏఐ – రిలయన్స్‌ జియో కీలక ఒప్పందం
- మొబైల్‌కు నేరుగా ప్రమాద హెచ్చరికలు
- కొత్త సిస్టమ్‌ దేశవ్యాప్తంగా అమలు పోవనుంది

నేటి వార్త న్యూఢిల్లీ : డిసెంబర్ 2 :
దేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణం ఇక మరింత సురక్షితంగా మారనుంది. 

హైవేల్లో ప్రమాదాలు తగ్గించేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) అత్యాధునిక మొబైల్‌ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను ప్రవేశపెడుతోంది. ఇందుకోసం రిలయన్స్‌ జియోతో మహత్తర ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ ఒప్పందం కింద ప్రమాద అవకాశాలు ఉన్న ప్రాంతాలు, కఠిన వాతావరణ పరిస్థితులు, రోడ్లపై పశువుల సంచారం, సడన్‌ డైవర్షన్స్ వంటి కీలక సమాచారాన్ని నేరుగా ప్రయాణికుల మొబైల్‌కు పంపనున్నారు.

ఈ సరికొత్త సిస్టమ్‌ కోసం అదనపు హెచ్చరిక బోర్డులు అవసరం లేకుండా, పూర్తిగా జియో 4జీ, 5జీ నెట్‌వర్క్‌పై ఆధారపడుతుందని అధికారులు తెలిపారు. 

ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ అలర్ట్స్, హై ప్రైయారిటీ కాల్స్‌ రూపంలో ముందస్తు హెచ్చరికలు చేరడం వల్ల డ్రైవర్లు ముందుగానే జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది.

ప్రాజెక్ట్‌ తొలి దశగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ కార్యాలయాల్లో పైలట్‌ మోడ్‌లో అమలవనుంది. ట్రయల్స్‌ తరువాత ఈ సిస్టమ్‌ను జాతీయ రహదారి నెట్‌వర్క్‌ మొత్తం మీద విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

 ఈ వ్యవస్థను హైవేయాత్ర యాప్‌, ఎన్‌హెచ్‌ఏఐ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్స్‌, నేషనల్‌ హైవే ఎమర్జెన్సీ నంబర్‌ 1033తో అనుసంధానం చేయనున్నారు.

డేటా రక్షణ ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ సురక్షితమైన హెచ్చరికలు అందేలా చర్యలు తీసుకుంటామని హైవేస్‌ అథారిటీ స్పష్టం చేసింది. 

భవిష్యత్తులో ఇతర టెలికాం సంస్థలను కూడా ఈ వ్యవస్థలో చేర్చి దేశవ్యాప్తంగా అన్ని హైవేలు రియల్‌ టైమ్‌ సేఫ్టీ అలర్ట్‌ ఫెసిలిటీతో పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. 

ఈ ఒప్పందం రహదారులపై జర్నీ సేఫ్టీని పెంపొందించే దిశగా ప్రధాన ముందడుగు అంటూ అధికారులు భావిస్తున్నారు.
Comments