స్క్రబ్‌ టైఫస్‌ మలేరియా, డెంగీలాంటిదే… భయం అక్కర్లేదు: ఏపీ ఆరోగ్య శాఖ భరోసా.

Rathnakar Darshanala
స్క్రబ్‌ టైఫస్‌ మలేరియా, డెంగీలాంటిదే… భయం అక్కర్లేదు: ఏపీ ఆరోగ్య శాఖ భరోసా.
* క్రొత్త వ్యాధి కాదు – ప్రతి సంవత్సరం కేసులు నమోదవుతాయి.

* సమయానికి మందులు తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చు.

* గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక అలర్ట్; రెస్పాన్స్‌ టీమ్‌లు సిద్ధం.

నేటి వార్త అమరావతి, డిసెంబర్ 8 : స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి గురించి రాష్ట్రంలో వస్తున్న ప్రచారంపై ప్రజలు బెదిరిపోవాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య–ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

ఇది కొత్త వ్యాధి కాదు, మలేరియా, డెంగీ లాంటిదే ఒక జ్వరవ్యాధి అని, సమయానికి చికిత్స అందితే పూర్తిగా తగ్గుతుందని ఆరోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్ తెలిపారు. 

ఈ ఏడాది ఇప్పటివరకు 1566 కేసులు నమోదయ్యాయని, గత ఏడాది 1613 కేసులు వచ్చాయని వివరించారు.

 9 మరణాలు నమోదైనప్పటికీ, వాటికి ప్రధాన కారణం ఆలస్యంగా ఆస్పత్రికి రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు కలగలిపి ఉండటం అని తెలిపారు. “స్క్రబ్‌ టైఫస్‌తో వెంటనే మరణించరు. 

ప్రజలు భయపడక్కర్లేదు. సమయానికి పరీక్షలు, చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా నియంత్రణలో ఉంటుంది” అని కమిషనర్ భరోసా ఇచ్చారు.

ఈ వ్యాధి చికిత్స కోసం అజిత్రోమైసిన్‌, డాక్సిసైక్లిన్‌ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

 జ్వరం వచ్చిన ఐదో రోజు నుంచి 20వ రోజు వరకు లక్షణాలు బయటపడే అవకాశం ఉండటంతో, దీర్ఘకాలిక జ్వరం ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

 వ్యవసాయ, అడవి ప్రాంతాల్లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉండటంతో, గ్రామీణ శాఖలకు ప్రత్యేక అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేయడం, కలెక్టర్లు ప్రతివారం కేసుల సమీక్ష చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

కేసులన్నీ IHIP పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణలో కూడా ఈ ఏడాది 183 కేసులు నమోదయ్యాయని, అక్కడ కూడా చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు.
Comments