మోడల్ స్కూల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆందోళన.

Rathnakar Darshanala
మోడల్ స్కూల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆందోళన.
 – ఆరు నెలలుగా వేతనాల్లేక తీవ్ర ఇబ్బందులు.

నేటివార్త రాయికల్ సెప్టెంబర్ 1: 

తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్‌లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది—కంప్యూటర్ ఆపరేటర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, అటెండర్లు,వాచ్మెన్లు ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్న జీతాలతోనే కుటుంబ పోషణ సాగిస్తున్న ఈ సిబ్బంది, నెలల తరబడి జీతాలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు.

 ప్రయాణ ఖర్చులకే డబ్బులు లేక స్కూల్‌కు హాజరు కావడం కష్టమవుతోందని తెలిపారు. అందువల్ల సెప్టెంబర్ 1 నుండి జీతాలు అందేవరకు విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.

మోడల్ స్కూల్ నిర్వహణలో ఈ సిబ్బందే కీలకమని తల్లిదండ్రులు గుర్తుచేస్తున్నారు.ఒక్కో స్కూల్లో సగటున 700 మంది విద్యార్థులు ఉండగా,వారి నిత్య నిర్వహణకు కేవలం ఒక్కో ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, వాచ్ మెన్ పై ఆధారపడాల్సి వస్తుంది. 

వీరి గైర్హాజరు పాఠశాలల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఔట్సోర్సింగ్ సిబ్బందికి తక్షణమే వేతనాలు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments