షుగర్ పెషేంట్లకు...గుడ్ న్యూస్.
By
Rathnakar Darshanala
షుగర్ పెషేంట్లకు...గుడ్ న్యూస్.
త్వరలో 90% తక్కువ ధరకే షుగర్ మెడిసిన్?..
- ధరల్లో భారీ తగ్గింపు
- షుగర్ వ్యాప్తి ఆర్థిక భారం
- షుగర్ వారికి ఊరట
- ధరలు తగ్గుతే భారం తగ్గుతుంది
నేటి వార్త సెంట్రల్ డెస్క్ : టైప్-2 మధుమేహ వ్యాధికి వాడుతున్న ఎంపాగ్లిఫ్లోజిన్ త్వరలో అతి తక్కువ ధరకు
అందుబాటులోకి రానుంది.
అనేక భారతీయ ఫార్మా కంపెనీలు ఈ డయాబెటిస్ మెడిసిన్కు చెందిన జనరిక్ వెర్షన్లను అత్యంత తక్కువ ధరకు తయారు చేసేందుకు సిద్ధమవుతునాయి.
ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న బోహ్రింగర్ ఇంగెలేమ్ పేటెంట్ గడువు మార్చి 11తో ముగుస్తుండటంతో దేశీయంగా కంపెనీ దాని కెమికల్ ఫార్ములాతో జెనరిక్ వెర్షన్ను తీసుకురానున్నాయి.
మ్యాన్కైండ్ ఫార్మా, టొరెంట్, ఆల్కెమ్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ వంటి కంపెనీలు దీని తయారీకి సిద్ధంగా ఉన్నాయి.
జెనరిక్ వెర్షన్ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ మెడిసిన్ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా దేశంలోని కోట్లాది మంది మధుమేహ చికిత్స పొందుతున్న వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.
* ధరలో భారీ తగ్గుదల...
దేశంలోని నాల్గవ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ సంస్థ అయిన మ్యాన్కైండ్ ఫార్మా ప్రకారం, ఎంపాగ్లిఫ్లోజిన్ ఇన్నోవేటర్ సుమారు ధర రూ. 60 ఉంది. దీన్ని జెనరిక్ వెర్షన్లో పదో వంతుకు అందించాలని భావిస్తోంది.
చాలా జెనరిక్ వెర్షన్లు ఒక్కో టాబ్లెట్ ధర రూ.9, రూ.14 మధ్య ఉండవచ్చని అంచనా. దీనివల్ల డయాబెటిస్ థెరపీ మరింత అందుబాటు ధరలో లభిస్తుంది.
ఇదే సమయంలో తక్కువ ధర కారణంగా భారత మధుమేహ ఔషధాల మార్కెట్ను గణనీయంగా ప్రభావితం చేయనుంది. మధుమేహ ఔషధ మార్కెట్ 2021లో రూ.14,000 కోట్ల నుంచి ప్రస్తుతం దాదాపు రూ. 20,000 కోట్లకు పెరిగింది.
మధుమేహం వ్యాప్తి, ఆర్థిక భారం..
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
దేశంలో మెడికల్ రీయింబర్స్మెంట్ పొందే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో చాలామంది రోగులు చికిత్స ఖర్చుల నిమిత్తం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
డయాబెటిస్ చికిత్స పద్దతి...
టైప్-2 మధుమేహానికి మెట్ఫార్మిన్ ప్రాథమిక మెడిసిన్గా ఉంది. అయితే వ్యాధి ముదిరే కొద్దీ సల్ఫోనిలురియాస్, డీపీపీ-4 ఇన్హిబిటర్స్, ఎసీఎలీ2 ఇన్హిబిటర్స్-ఎంపాగ్లిఫ్లోజిన్తో సహా-అదనపు మందులు అవసరమవుతాయి.
ఇటీవల, సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి కొత్త మందులు మార్కెట్లోకి ప్రవేశించాయి. ఇవి మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణ, హృదయనాళానికి సంబంధించి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
సరసమైన ధరలో ఎంపాగ్లిఫ్లోజిన్ జెనరిక్స్ దేశీయ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా ఔషధ సంస్థల మధ్య పోటీ పెరిగినప్పటికీ, చికిత్స మరింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
సాధారణంగా బ్రాండెడ్ మందుల తయారీపై సదరు కంపెనీకి 20 ఏళ్ల పేటెంట్ హక్కులుంటాయి. ఈ సమయంలో కంపెనీ అనుమతి లేకుండా మరే కంపెనీ కూడా వాటిని తయారు చేయకూడదు.
పెటెంట్ ఉండటం మూలంగా మెడిసిన్ తయారీ ఖర్చుకు, అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత అదే కెమికల్ ఫార్ములాతో క్లినికల్ ట్రయల్స్ లేకుండా మెడిసిన్ తయారు చేయడం వల్ల ధర గణనీయంగా తగ్గుతుంది.
Comments