ప్రజా పాలన కార్యక్రమానికి అద్బుత స్పందన ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన.

Rathnakar Darshanala
ప్రజా పాలన కార్యక్రమానికి అద్బుత స్పందన ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన.
ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జనవరి 06 అడిచర్ల రమేష్

శనివారం ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమా నికి విచ్చేసిన ప్రజా పాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవసేన ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ ఘన స్వాగతం పలికారు.

ప్రజా పాలన కార్యక్రమానికి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన దరఖాస్తుదారు లతో  ప్రజా పాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ముచ్చటించి వారు దరఖాస్తు చేసుకున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
కార్యక్రమంలో ప్రజా పాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవసేన మాట్లాడుతూ,ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పెద్దపల్లి జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని,  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా రెండున్నర సంవత్సరాల పాటు తాను పనిచేయడం తన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, పెద్దపల్లి జిల్లా ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ, సహకారం తనకు లభించాయని ఆమె గతంలో కలెక్టర్ గా చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.

గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని, ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని, గ్యారంటీ పథకాలపై మంచి అవగాహనతో ప్రజలు వారికి అవసరమైన పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేసి, నిర్దిష్ట ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అర్హులను ఎంపిక చేసి  పథకాలను అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

మహిళల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని, మహిళల కోసమే ప్రత్యేకంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, నెలకు 2500 రూపాయల సహాయం వంటి గ్యారెంటీ పథకాలను చేపడుతుందని అన్నారు.

ప్రజా పాలన కార్యక్రమానికి సైతం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంచి స్పందన కనబరిచారని అన్నారు.

ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిద్దిపేటలో అద్భుత పనితీరు కనబరిచారని,  వారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛత  పారిశుద్ధ్య అంశంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించి మన పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు రావాలని ఆమె ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రజలకు పథకాలను అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాల్లో ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తుల స్వీకరిస్తున్నామని అన్నారు . ప్రజా పాలన కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తులలో  ప్రతి పథకానికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ప్రకారం అర్హులకు అమలు చేస్తామని అన్నారు.

నూతన రేషన్ కార్డుల కోసం సైతం ప్రజా పాలన కార్యక్రమంలో తెల్ల కాగితంపై దరఖాస్తు సమర్పించాలని, రేషన్ కార్డు దరఖాస్తులు, ఇతర దరఖాస్తుల సమర్పణ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని అన్నారు.

గ్యారెంటీ పథకాల అమలు, ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించ వచ్చని,  ప్రజలు వారి పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకు వచ్చి వారి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న  పెద్దపల్లిఎమ్మెల్యే విజ్జన మాట్లాడుతూ,రాబోయే ఐదు సంవత్సరా లలో ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, దశల వారీగా అర్హులకు లబ్ధి చేకూరుతుందని, ముందు వరుసలో అత్యంత నిరుపేదలకు ఇండ్ల మంజూరు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించే సమయంలో తప్పనిసరిగా ఇంటి మీటర్ నెంబర్ నమోదు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

మహాలక్ష్మి పథకం క్రింద అర్హులైన మహిళలందరికీ నెలకు 2500 రూపాయల సహాయం చేయడం జరుగుతుందని, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని, మహిళలు తమ గ్యాస్ సిలిండర్ కంపెనీ పేరు, గ్యాస్ నెంబర్ నమోదు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

రైతు భరోసా కార్యక్రమం క్రింద రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం చేస్తామని దీనికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, చేయూత కార్యక్రమం క్రింద పెన్షన్దారులకు 4000 పెన్షన్ మంజూరు చేస్తామని, నూతన పించన్ దారులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

అభయ హస్తం గ్యారెంటీ పథకాల అమలులో ఎట్టి పరిస్థితిలో అవినీతికి ఆస్కారం ఉండదని, ప్రభుత్వ పథకాలను అర్హులకు దశల వారీగా పారదర్శకంగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, సింగిల్ విండో చైర్మన్, జడ్పిటిసి, ఎంపిటిసి, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఎన్.శిరీష, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Comments