చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు పై కీలక నిర్ణయం.

Rathnakar Darshanala
చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు పై కీలక నిర్ణయం.

 నేటి వార్త స్టేట్ బ్యూరో నవంబర్ 28 


ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ,జనసేన అధినేతలు ఇద్దరూ ఇక ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. వరుస కేసులు..53 రోజుల జైలు..కంటికి శస్త్ర చికిత్స కారణాలతో దాదాపు మూడు నెలలు చంద్రబాబు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నారు.

ఇక..ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఇదే సమయంలో టీడీపీ -జనసేన సీట్ల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నికల రాజకీయం:ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. ఈ సారి ఎన్నికల్లో జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీ - జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతున్నా..ఆ పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమతో బీజేపీ పొత్తు కడుతుందని ఈ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వరుస కేసుల్లో చంద్రబాబు చిక్కుకున్నారు.
ఎన్నికలకు సిద్దం కావాల్సిన కీలక సమయం లో మూడు నెలలు పూర్తయింది. బెయిల్ వచ్చినా కోర్టు కండీషన్లు..అనారోగ్య కారణాలతో చంద్రబాబు విశ్రాంతికే పరిమితం అయ్యారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు కేడర్ ను సంసిద్దులను చేయటంతో పాటుగా రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. అయితే...ఈ సారి పవన్ తో పాటుగా కలిసి సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.

జనంలోకి చంద్రబాబు:చంద్రబాబు విశ్రాంతి సమయంలోనే కొన్ని నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని విడివిడిగా మాట్లాడుతున్నారు. కంటి చికిత్స తర్వాత మొదటిసారి సోమవారం ఆయన బయటకు వచ్చి ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనే నిమిత్తం తన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ నెల 30వ తేదీన ఆయన తిరుమల వెళ్తున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి ఒకటో తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

తర్వాతి రోజుల్లో బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్ననూ దర్శించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొని వేగం పెంచుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆయన మూడు బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాయకత్వం యోచిస్తోంది.

సీట్ల ఖరారు పైనా చర్చలు:లోకేశ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో డిసెంబరులో భారీ బహిరంగ సభ ఉంటుంది. అందువల్ల ఉత్తరాంధ్రను మినహాయించి మిగిలిన రెండు ప్రాంతాల్లో రెండు సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభకు పవన్ హాజరవుతారని సమాచారం.

ఇక..చంద్రబాబు - పవన్ కలిసి సభల్లో పాల్గొనటం ద్వారా క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కేడర్ మధ్య సమన్వయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, సీట్ల సర్దుబాటు విషయంలోనూ నేరుగా చంద్రబాబు -పవన్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జనసేనకు 25 -30 సీట్ల వరకు ఇచ్చేలా జాబితా సిద్దం అయినట్లు సమాచారం.

         జనవరి తొలి వారంలో అభ్యర్దుల ను ఖరారు చేస్తారని తెలుస్తోంది. దీంతో, రెండు పార్టీల నుంచి ఆశావాహుల్లో ఈ సీట్ల ఖరారు పైన ఉత్కంఠ పెరుగుతోంది.
Comments