అభిమానులతో పోటెత్తిన భద్రగిరి.కాంగ్రెస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సక్సెస్. నేటి వార్త భద్రాద్రి :

Rathnakar Darshanala
అభిమానులతో పోటెత్తిన భద్రగిరి.                                    
* కాంగ్రెస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ భారీ సక్సెస్                                
* భద్రాద్రి అభివృద్ధికి మళ్ళీ కంకణ బద్ధులవుతాం
* మాజీ మంత్రి తుమ్మల                         
* రామున్నే మోసం చేసిన కెసిఆర్: మాజీ ఎంపీ పొంగులేటి                               
* పొదెంకు ఓటేసి భద్రాద్రిని కాపాడుకుందాం: మాజీ ఎమ్మెల్సీ బాలసాని                   
* రానుంది కాంగ్రెస్ ప్రభుత్వమే: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం        

భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ కరస్పాండెంట్, నేటి వార్త: 
భద్రాచలం పుణ్యక్షేత్రంలో మంగళవారం
పర్యటించిన కాంగ్రెస్ నేతలకు పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేషంగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో భద్రగిరి పోటెత్తింది. పట్నంలోని కూరగాయల సెంటర్లో నిర్వహించిన కాంగ్రెస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ భారీ సక్సెస్ అయింది.

 ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి చేసే బాధ్యత తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. భద్రాచలం కు తనకు ఎంతో విడదీరాని సంబంధం ఉందన్నారు.

ఆనాడు ఎన్టీఆర్ తనను ఈ గడ్డమీదికి తీసుకొచ్చారని, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో 40 ఏళ్ల పాటు రాజకీయ రంగంలో ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో భద్రాచలం గుడి అభివృద్ధి జరిగిందన్నారు. మిధుల స్టేడియంకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భద్రాచలం  ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి వాటర్ ట్యాంకుల నిర్మాణం చేశామన్నారు.

టిడిపి హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందన్నారు. ఆనాడు తలపెట్టిన జాతీయ రహదారి విజయవాడ - జగదల్పూర్ వయా భద్రాచలం ఏర్పాటుకు నోచుకుంది అన్నారు. భద్రాచలం -ఏటూర్ నాగారం- మహారాష్ట్ర జాతీయ రహదారి నిర్మాణం జరిగిందన్నారు.

కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కు జాతీయ రహదారి త్వరలోనే జరుగుతుందని తెలిపారు. భద్రాచలం వరకు రైలు తీసుకొస్తామని వెల్లడించారు. భద్రాచలంకు ఒకే పంచాయతీ కావాలా...? టెంపుల్ సిటీ కావాలా...? మీ అభిప్రాయం ప్రకారమే అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే మీరు చెప్పింది చేసి చూపిస్తామని వెల్లడించారు.

భద్రాచలంలో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఇల్లే కట్టుకుంటామంటే ఐదు లక్షల రూపాయలు నిధులు ఇస్తామని  తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య నీతిమంతుడని, ధర్మాత్ముడని, మంచిమనిషి అని  అటువంటి వ్యక్తిని మళ్లీ ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకోవాలని సూచించారు.                                
*రాముని మోసం చేసిన కేసీఆర్ : పొంగులేటి*                       
మనుషులను మోసం చేయడమే కాకుండా, విలేకరులను మోసం చేయటమే కాకుండా, చివరికి రామున్ని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. భద్రాద్రి కి ఇస్తానన్న  రూ.1000 కోట్లు ఇవ్వకపోగా ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు.

సాంప్రదాయబద్ధంగా వస్తున్న రామయ్య కళ్యాణానికి సీఎం తెచ్చే తలంబ్రాలు తంతును కూడా విస్మరించటం విడ్డూరంగా ఉందన్నారు. గడిచిన తొమ్మిది పర్యాయాల్లో  భద్రాచలంకు ఒకేసారి శ్రీరామనవమికి వచ్చాడని భద్రాచలం పుట్టాక బహుశా ఇటువంటి సీఎంను ఎవరు చూడలేదని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెప్పిన కథలే చెబుతూ, పుక్కేడు పురాణాలు వల్లిస్తూ మళ్లీ మూడోసారి ముందుకు వస్తున్నాడని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కెసిఆర్ చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని,76-78 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం తధ్యమని, డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం చేయనున్నారని పొంగులేటి జోష్యం చెప్పారు. వీరయ్య నీతిమంతుడు, నిజాయితీపరుడని అన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలిస్తే, ఇందులో 12 మంది పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళితే పొదెం వీరన్న కూడా ఆ పార్టీ రూ.25 నుంచి 30 కోట్లు ఆఫర్ చేస్తే మూడు రంగుల కాంగ్రెస్ జెండాను విడవకుండా అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తని వీరన్న నిరూపించాడని ఈ విషయాన్ని ప్రాంత ప్రజలు గుర్తుంచుకొని రానున్న ఎన్నికల్లో వీరన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

 కారు డీజిల్ కు డబ్బులు లేకపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న గొప్ప చరిత్ర వీరన్నది అన్నారు. ఇందిరామ్మ రాజ్యం వస్తే ప్రతి నెల ఒకటో తేదీన మహిళలకు రూ.2500 ఖర్చుల నిమిత్తం అకౌంట్లోకి వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం గ్యాస్ ధర 1200 ఉందని, కాంగ్రెస్ హయాంలో రూ. 500 లకే గ్యాస్ బండను ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు వరకు వర్తింప చేస్తామన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. నాణ్యమైన సన్న బియ్యం సప్లై ఉంటుందని వెల్లడించారు. ఆడపిల్లల వివాహానికి రూ.1,00,016 రూపాయల తో పాటు, తులం బంగారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

 అర్హులైన వారికి పోడు భూములకు పట్టాలు పూర్తిస్థాయిలో ఇస్తామన్నారు. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలందరి పైన ఉందని వెల్లడించారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగం తాండవిస్తుంటే, కెసిఆర్ కుటుంబానికి మాత్రం ఆరు ఉద్యోగాలు దొరికాయి అన్నారు.
కెసిఆర్ సీఎం, కొడుకు కేటీఆర్ మంత్రి, అల్లుడు హరీష్ రావు మంత్రి, దయాకర్ రావు మంత్రి, కూతురు కవిత ఎమ్మెల్సీ, మేనల్లుడు సంతోష్ ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. వీళ్ళ సంక్షేమం కోసమే తప్ప, ప్రజా సంక్షేమం కోసం ఈ తొమ్మిదేళ్లు పాటుపడింది ఏమీ లేదని వెల్లడించారు                              
*పొదెంకు ఓటేసి భద్రాద్రిని కాపాడుకుందాం:
 మాజీ ఎమ్మెల్సీ బాలసాని*                     
ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొదెం వీరయ్యను మరొకమారు ఎమ్మెల్యేగా గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడదామని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రావడం తధ్యమని, భద్రాచలం నియోజకవర్గం ప్రగతి బాటన నడవటం ఖాయమని వెల్లడించారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భద్రాచల ప్రాంత అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమి లేదని తెలిపారు. మాయ మాటలతో కాలయాపన చేసింది అన్నారు. భద్రాచలం పుణ్యక్షేత్ర ప్రగతికి కేసీఆర్ ప్రభుత్వం నిరోధకంగా మారిందన్నారు.                            
*రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే:ఎమ్మెల్యే పొదెం*                            
కేంద్రంలో, రాష్ట్రంలో ఈసారి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తద్వారా   భద్రాచలం ప్రాంత అభివృద్ధి జరిగి తీరుతుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భద్రాచలం ప్రాంత అభివృద్ధిని అడ్డుకుందని వెల్లడించారు.

ఈ విషయాలన్నీ స్థానిక ప్రజలకు తెలుసని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తమ బుద్ధి చెప్పటం ఖాయమని పేర్కొన్నారు. తప్పకుండా ప్రజలు తనకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు చింతిరాల రవికుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ల నరేష్, కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, బలుసు సతీష్ కుమార్, తమ్ముళ్ల వెంకటేశ్వరరావు, (టీవి)తోటకూర రవిశంకర్, టిడిపి నాయకులు కొడాలి శ్రీనివాస్, ఎస్.కె అజీమ్, కుంచాల రాజారాం, కంభంపాటి సురేష్ కుమార్, సిపిఐ పార్టీ నాయకులు రావులపల్లి రవికుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరేల సుధీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్, పట్టణ కాంగ్రెస్, టిడిపి, సిపిఐ నాయకులు,కార్యకర్తలు,
అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments