కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహణకు అధికారులు సన్నద్దం కావాలి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్.

Rathnakar Darshanala
కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహణకు అధికారులు సన్నద్దం కావాలికలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  ముజమ్మిల్ ఖాన్.

రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి కౌంటింగ్ పై అధికారులకు అందించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి నవంబర్ 25 అడిచెర్ల రమేష్.

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 
శనివారం రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్, మంథని, పెద్దపల్లి ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.ఎన్.శ్రీధర తో కలిసి కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు అందించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,  డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు. 

కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తించుకోవాలని, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, ప్రతి కంట్రోల్ యూనిట్  లో నమోదయిన మొత్తం ఓట్ల వివరాలు చూపించి, తరువాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు అందరికి స్పష్టంగా తెలిసేలా చూపించాలని, ఆ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాలులో 14 టేబుల్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 21 రౌండ్లు, మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో 20 రౌండ్లు, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో 18 రౌండ్లు ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభ మవుతుందని అన్నారు. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5 ఈవిఎం లను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి, వివి ప్యాట్ల ఓట్ల లెక్కింపు చేయడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని, ఎటువంటి సందర్భం ఎదురైనప్పటికి ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దని అన్నారు. 

ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత ఆ రౌండ్ లో ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలను రిటర్నింగ్ అధికారికి అందించాలని, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన పోర్టల్ లో కూడా నమోదు చేయాలని, కంట్రోల్ యూనిట్లు ఓపెన్ కాని పక్షంలో రిటర్నింగ్ అధికారికి వెంటనే సమాచారం అందించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, రామగుండం, మంథని, పెద్దపల్లి రిటర్నింగ్ అధికారులు జే.అరుణ శ్రీ, వి.హనుమా నాయక్ , సి.హెచ్. మధుసూధన్, తహసిల్దార్ లు, మంథని ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి టి.రవీందర్, డి.టి. ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments