HYD :నిర్లక్ష్యానికి శిక్ష: అధికారి సస్పెన్షన్‌!

Rathnakar Darshanala
నిర్లక్ష్యానికి శిక్ష: అధికారి సస్పెన్షన్‌!
*​-గచ్చిబౌలి ఘటనలో ఇద్దరు బలి.. మాదాపూర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిపై వేటు*

*-​నిబంధనలు గాలికొదిలిన యజమానులపై క్రిమినల్‌ కేసులు.. నగరవ్యాప్తంగా కూల్చివేతలకు ఆదేశం*

నేటి వార్త,సైబరాబాద్:

అనుమతుల్లేని నిర్మాణాలపై చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారుల ఉదాసీనత ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొనడంతో సైబరాబాద్‌ నగరపాలక సంస్థ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. 

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నేల అంతస్తుతో పాటు మరో ఆరు అంతస్తులు, పెంట్‌హౌస్‌ శనివారం పేకమేడలా కుప్పకూలి ఇద్దరు మరణించడంతో పాటు పక్క భవనం,

పాక్షికంగా ధ్వంసమైన దుర్ఘటనపై కమిషనర్‌ సృజన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాదాపూర్‌ సర్కిల్‌-50 టౌన్‌ ప్లానింగ్‌ భవన నిర్మాణ అధికారి యు.సంతోష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు.

 గత జూన్‌ 17నే నోటీసులు ఇచ్చినా నిర్మాణాన్ని నిలువరించడంలో ఘోరంగా విఫలమైన సదరు అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు, సెట్‌బ్యాక్‌లు, అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించిన ఫర్హీన్‌ సిద్ధిఖ్‌, ఎండీ సాజిద్‌లపై రాయదుర్గం ఠాణాలో క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. 

ప్రజా భద్రతకే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసిన కమిషనర్‌, కార్పొరేషన్‌ పరిధిలోని అక్రమ కట్టడాలపై సమగ్ర తనిఖీలు చేపట్టి, ఉపేక్షించకుండా తక్షణమే కూల్చివేతలు చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
Comments