ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది :KTR.
By
Rathnakar Darshanala
ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది :KTR.
- రాజన్న సిరిసిల్లలో ఆటో డ్రైవర్ల భారీ సమూహం మధ్య కేటీఆర్ సందేశం
- కార్మిక పక్షపాతం కేసీఆర్ పాలనలోనే నిజమైందని వ్యాఖ్య
- ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు వరకు పోరాటం కొనసాగుతుందన్న హెచ్చరిక
నేటి వార్త రాజన్న సిరిసిల్ల, 10 డిసెంబర్ :
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసే ఆత్మీయ భరోసా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు హాజరైన ఈ కార్యక్రమంలో, ఆటోడ్రైవర్ సమాజం కోసం బీఆర్ఎస్ కట్టుబాటు కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “ఉద్యమకాలంలో కేసీఆర్ దీక్ష సమయంలో ముందుండి పోరాడిన వర్గాలలో ఆటో డ్రైవర్లు ముఖ్యులు. కార్మిక పక్షపాతి నాయకుడు కేసీఆర్ రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు. ఆయన చేసిన సంక్షేమాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు” అని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్, “రెండేళ్లలో మార్పు మార్పు అంటూ ఎలా మోసం చేస్తారో అందరికీ అర్ధమైంది.
రాహుల్ గాంధీ మష్రత్ అలీ ఆటోలో ఎక్కి ఇచ్చిన హామీలు ఏమైయ్యాయో చూడండి అలీ ఈ రోజుకి రెండు ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుతున్నాడు” అని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని విమర్శించారు.
ఆటో డ్రైవర్లకు ముఖ్యమైన సంక్షేమం నిర్లక్ష్యం చెయ్యబడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “420 హామీలు ఇచ్చి అందరినీ మోసం చేశారు.
నెలకు వెయ్యి రూపాయల చొప్పున రెండు సంవత్సరాల కాలంలో ఆటో డ్రైవర్లకు ₹1560 కోట్లు బకాయి ఉందని” ఆయన పేర్కొన్నారు. జిల్లా లోని అన్నిరకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును అసెంబ్లీ సమావేశాల వరకు ఏర్పాటు చేయకపోతే, హైదరాబాద్‌లో మహాధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. “
కాంగ్రెస్ ఊరికే ఏమీ ఇవ్వదు గల్లా పట్టి అడిగితేనే ఇస్తుంది” అని సెటైర్ వేశారు. ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ₹10 లక్షల నష్టపరిహారం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, వారి సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Comments