తెలంగాణ రాజ్‌భవన్ పేరు మార్పు: ప్రభుత్వం ‘లోక్ భవన్’గా నోటిఫికేషన్.

Rathnakar Darshanala
తెలంగాణ రాజ్‌భవన్ పేరు మార్పు: ప్రభుత్వం ‘లోక్ భవన్’గా నోటిఫికేషన్.
- వలసవాద భావజాలం తొలగింపు దిశగా పేర్ల మార్పు
- కేంద్ర సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు

నేటి వార్త హైదరాబాద్, డిసెంబర్ 2 :

తెలంగాణ ప్రభుత్వం రాజ్‌భవన్ పేరును ‘లోక్ భవన్’గా మార్చేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సూచనల అనంతరం తీసుకోబడింది. 

వలసవాద కాలపు నిర్మాణాలు, పేర్లలో ప్రతిఫలించిన అధికార వాద భావజాలం తొలగించి, ప్రజాస్వామ్య పునాదులను ప్రతిబింబించేలా పేర్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో, ఈ మార్పు అమల్లోకి వచ్చింది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖ రాసి, రాజ్‌భవన్, రాజ్ నివాస్ వంటి పేర్లు ప్రజాస్వామ్య దృక్పథానికి అనుగుణంగా లేవని, అవి వలసవాద వారసత్వంతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది.

 ప్రజల ప్రాముఖ్యత ప్రతిబింబించే శైలిలో ఉన్న పేర్లు అధికార భవనాలకు ఉండాలని సూచించింది.
కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ మార్పుల్లో ముందంజ వేశాయి.

 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాలు తమ రాజ్‌భవన్‌ల పేర్లను ‘లోక్ భవన్’ లేదా ‘లోక్ నివాస్’గా మార్చి నోటిఫికేషన్లు జారీ చేశాయి. తెలంగాణ ఈ జాబితాలో తాజాగా చేరింది.

పేర్ల మార్పు అనేది సాంప్రదాయిక ధోరణి నుంచి బయటపడాల్సిన అవసరాన్ని ప్రాముఖ్యతగా గుర్తించిన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

ప్రభుత్వ భవనాల పేర్లు ప్రజల ప్రతినిధిత్వం, స్వాతంత్ర భావజాలం, పాలనా విలువలకు అనుగుణంగా ఉండాలని, ఈ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని సాంస్కృతిక-పరిపాలనా సంస్కరణగా చూస్తున్నారు.

రాజ్‌భవన్‌ని ‘లోక్ భవన్’గా మారు పేరుతో పిలిచే చర్య రూపకల్పన పూర్తయిన అనంతరం, సంబంధిత శాఖల శాసన ప్రక్రియలు, బోర్డులు, పత్రాల్లో మార్పులు చేపట్టే అవకాశం ఉంది. 

ప్రభుత్వం ఈ మార్పుని త్వరితగతిన అమలు చేస్తుందని, తద్వారా కేంద్ర మార్గదర్శకాల అమలులో తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నట్టు పేర్కొంటోంది.
Comments