Hyderabad :పాసు బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ.

Rathnakar Darshanala

Hyderabad :పాసు బుక్  ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ.
* కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు 

* కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ డెస్క్ నేటి వార్త : భూమి పాసుబుక్ పై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రుణమాఫీపై పలు విషయాలు వెల్లడించారు. 

కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డును వాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలేనన్నారు. 

రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

 రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. 18వ తేదీ ఉదయం (గురువారం) 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

 రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని సూచించాలన్నారు. 

గతంలో కొందరు బ్యాంకర్లు అలానే చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు అలానే చేస్తామని హెచ్చరించారు. 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

 రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

 రైతు రుణమాఫీకి సంబంధించి  సచివాలయంలో రెండు జిల్లాలకు (ఉమ్మడి జిల్లాల చొప్పున) ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
Comments