దేవాదుల పైప్‌లైన్‌ను జాకారం ఊర చెరువుకు అనుసంధానించాలి.

Rathnakar Darshanala
దేవాదుల పైప్‌లైన్‌ను జాకారం ఊర చెరువుకు అనుసంధానించాలి.
- అడిషనల్ కలెక్టర్‌కు జాకారం రైతులు,నాయకుల వినతి

నేటివార్త,ములుగు ప్రతినిధి : జాకారం గ్రామంలోని ఊర చెరువుకు దేవాదుల పైప్‌లైన్‌ను తక్షణమే అనుసంధానం చేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జాకారం గ్రామ రైతులు,నాయకులు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీకి వినతిపత్రం సమర్పించారు.

మాజీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి గ్రామంలోని సాగునీటి సమస్యలను వివరించారు.

జాకారం శివారు ప్రాంతం మీదుగా దేవాదుల ప్రధాన పైప్‌లైన్ వెళ్తున్నప్పటికీ, సమీపంలోని ఊర చెరువుకు నీటిని మళ్లించే అవకాశం లేకపోవడంతో పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

దేవాదుల పైప్‌లైన్‌ను ఊర చెరువుకు అనుసంధానం చేస్తే చెరువుతో పాటు దిగువన ఉన్న లోకం చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండుతుందని తెలిపారు. 

దీంతో చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పైప్‌లైన్ అనుసంధాన పనులు చేపట్టాలని కోరారు. 

కార్యక్రమంలో దేవునూరి రమేష్, బండారి రమేష్, ఈర్ల చంద్రసేన, మ్యాదరి రాజేందర్, అన్నబోయిన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments